గ్రేటర్ హైదరాబాద్‌లో విద్యుత్ డిమాండ్ భారీగా పెరుగుతోంది. సోమవారం గరిష్ఠ డిమాండ్ 4,072 మెగావాట్లకు చేరగా.. సెప్టెంబర్ 15న 4,176 మెగావాట్లుగా నమోదైంది. వర్షాలు తగ్గి ఉష్ణోగ్రతలు పెరగడంతో వినియోగం అధికమైందని అధికారులు చెబుతున్నారు. మరోవైపు మాదాపూర్, గచ్చిబౌలి, కొండాపూర్, చందానగర్ తదితర ప్రాంతాల్లో తరచూ విద్యుత్ అంతరాయాలు ఇబ్బందులకు గురిచేస్తున్నాయి. చందానగర్ హుడా కాలనీకి చెందిన ఐటీ ఉద్యోగి రవికాంత్ మాట్లాడుతూ.. రోజుకు నాలుగుసార్లైనా కరెంట్ పోతోందని, వర్క్ ఫ్రమ్ హోమ్‌కు తీవ్ర ఇబ్బందిగా ఉందని ఆవేదన వ్యక్తం చేశారు.