దేశవ్యాప్తంగా దేవీ నవరాత్రులను భక్తిశ్రద్ధలతో జరుపుకుంటున్నారు. శ్రీశక్తి స్వరూపిణి అయిన అమ్మవారిని పూజిస్తూ, చెడుపై మంచి సాధించిన విజయానికి గుర్తుగా ఈ వేడుకలు నిర్వహిస్తారు. తొమ్మిది రోజుల భీకర యుద్ధం తర్వాత పదవ రోజున దుర్గాదేవి మహిషాసురుడిని వధించిన సందర్భంగా ఈ వేడుకలు జరుపుకుంటారు. భక్తులు తొమ్మిది రాత్రుల పాటు అమ్మవారిని 9 విభిన్న రూపాల్లో (నవదుర్గలు) విశేషంగా పూజిస్తారు. రావణ సంహారానికి ముందు శ్రీరాముడు అమ్మవారి అనుగ్రహం కోసం ఈ పూజలు చేసి విజయదశమి రోజున విజయం సాధించాడని పురాణాలు చెబుతాయి.