
అమెరికాలో కాల్పులు.. ఆరుగురు చిన్నారులతో సహా 12 మందికి గాయాలు!
అమెరికాలోని ఫ్లోరిడా రాష్ట్రం, తల్లాహస్సీ నగరంలో శనివారం రాత్రి ఘోర కాల్పుల ఘటన జరిగింది. ఫ్లోరిడా ఏ అండ్ ఎం విశ్వవిద్యాలయంలో హోమ్ కమింగ్ ఫుట్బాల్ మ్యాచ్ ముగిసిన తర్వాత రెండు వర్గాల మధ్య మొదలైన గొడవ, కాల్పులకు దారితీసింది. ఈ ఘటనలో ఆరుగురు చిన్నారులతో సహా మొత్తం 12 మంది తీవ్రంగా గాయపడ్డారు. వీరిలో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు బాధితులను ఆసుపత్రికి తరలించారు. ఇప్పటి వరకు ఎవరినీ అరెస్టు చేయలేదని అధికారులు పేర్కొన్నారు.




