
టైరు పేలి పొలాల్లోకి దూసుకెళ్లిన వాహనం.. ఐదుగురికి తీవ్ర గాయాలు
కరీంనగర్-వరంగల్ జాతీయ రహదారిపై ఆదివారం ఉదయం ఓమ్ని వ్యాన్ అదుపుతప్పి పొలాల్లోకి దూసుకెళ్లడంతో తొమ్మిది మంది గాయపడ్డారు. హుజూరాబాద్ పట్టణ పరిధిలోని పెద్ద పాపయ్యపల్లి శివారులో ఈ ఘటన జరిగింది. హనుమకొండ కొత్తూరుకు చెందిన కూలీలు పనుల నిమిత్తం వెళ్తుండగా, వాహనం వెనుక టైరు పేలిపోవడంతో డ్రైవర్ నియంత్రణ కోల్పోయాడు. ఐదుగురికి తీవ్ర గాయాలవగా, మరో నలుగురికి స్వల్ప గాయాలయ్యాయి. తీవ్రగాయాలైన వారి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. క్షతగాత్రులను హుజూరాబాద్ ఏరియా ఆసుపత్రికి తరలించి, మెరుగైన చికిత్స కోసం ఎంజీఎం ఆసుపత్రికి తరలించే ఏర్పాట్లు చేస్తున్నారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.






















