జమ్మూకశ్మీర్‌లోని కుల్గామ్‌లో భద్రతా బలగాలు జరిపిన ఎన్కౌంటర్లో లష్కరే తోయిబా ఉగ్రవాది లతీఫ్ భట్ హతమయ్యాడు. నవంబర్ 11న అఖ్రాన్లోని సీఆర్పీఎఫ్ చెక్‌పోస్టుపై జరిగిన దాడిలో ఇతడి ప్రమేయం ఉంది. ఈ ఘటనలో ముగ్గురు సీఆర్పీఎఫ్ సిబ్బంది గాయపడ్డారు. అప్పటి నుంచి భద్రతా బలగాలు అతడి కోసం గాలిస్తున్నాయి. ఓ మసీదులో దాక్కున్న లతీఫ్‌ను లొంగిపోవాలని పోలీసులు వీడియో కాల్ ద్వారా పలుమార్లు కోరినా నిరాకరించాడు. నవంబర్ 18 తెల్లవారుజామున 2.45 గంటల సమయంలో భద్రతా బలగాలపై కాల్పులు జరపడంతో ఎదురుకాల్పులు ప్రారంభమయ్యాయి. మసీదు పవిత్రతను దృష్టిలో ఉంచుకుని బలగాలు సంయమనం పాటించినట్లు అధికారులు తెలిపారు. చివరకు కాల్పుల్లో లతీఫ్ హతమయ్యాడు.