తెలంగాణలో ‘చేయూత’ పథకం కింద కొత్త పెన్షన్ల పంపిణీ దసరా నుంచి ప్రారంభించేలా ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. రాష్ట్రంలో 2.5 లక్షల కొత్త పెన్షన్లకు ప్రభుత్వం అనుమతించగా.. గత నెల 9 నుంచి సెర్ప్ దరఖాస్తులు స్వీకరిస్తోంది. దరఖాస్తుల పరిశీలనను ఈ నెలాఖరు వరకు కొనసాగించి, వచ్చే నెల మొదటి వారంలో లబ్ధిదారులను ఎంపిక చేయాలని భావిస్తోంది. ధ్రువీకరణపత్రాల జారీలో ఇబ్బందులు ఎదురవుతున్న నేపథ్యంలో ఒంటరి మహిళలకు తహసీల్దార్లతోపాటు ఎంపీడీవోలు, మున్సిపల్, డిప్యూటీ కమిషనర్లు కూడా పత్రాలు జారీ చేసేలా వెసులుబాటు కల్పించారు.