TG: వరంగల్ జిల్లా వర్ధన్నపేటలో కొండచిలువల సంచారం స్థానికులను భయాందోళనకు గురి చేసింది. శనివారం దమ్మన్నపేట నుంచి బండౌతపురం వెళ్లే రహదారిపై 5 అడుగులకు పైగా పొడవున్న కొండచిలువ వాహనదారుల కంటపడింది. దీంతో వారు ఈ దృశ్యాలను ఫొటోలు, వీడియోలు తీసి సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఇటీవల ఉప్పరపల్లి క్రాస్‌రోడ్డు సమీపంలోని జాతీయ రహదారిపైనా కొండచిలువ కనిపించినట్లు స్థానికులు చెప్పుకుంటున్నారు. ఈ నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు.