TG: హైదరాబాద్ బాచుపల్లిలో సెప్టిక్ ట్యాంక్లో పడి ముగ్గురు కార్మికులు మృతి చెందిన ఘటనపై తెలంగాణ మానవ హక్కుల కమిషన్ సుమోటోగా విచారణ చేపట్టింది. ఈ ఘటనలో భద్రత నిబంధనల ఉల్లంఘనపై కమిషన్ తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. పత్రిక కథనాల మేరకు సుమోటో విచారణకు స్వీకరించింది. ఈ మేరకు మున్సిపల్ పరిపాలన, పట్టణాభివృద్ధి శాఖ ప్రభుత్వ కార్యదర్శి, మేడ్చల్ జిల్లా కలెక్టర్ నుంచి వివరణాత్మక నివేదికలు కోరింది. అలాగే మృతుల కుటుంబాలకు అందించిన పరిహారం, ఆర్థిక సహాయం వంటివి పొందుపరిచి డిసెంబర్ 22 లోగా సమర్పించాలని సూచించింది.