వర్షాలు పడుతున్నప్పుడు ఆకాశంలో మెరుపులు నేరుగా కాకుండా వంకరటింకరగా కనిపిస్తుంటాయి. దీని వెనుక ఆసక్తికరమైన శాస్త్రీయ కారణం ఉంది. సాధారణంగా గాలి విద్యుత్‌ను సులభంగా ప్రసారం చేయదు. మేఘాల్లో విద్యుత్ ఛార్జ్ ఎక్కువగా పేరుకుపోయినప్పుడు, అది నేలవైపు ప్రయాణించేందుకు అనువైన మార్గాన్ని ఏర్పరుచుకుంటుంది. ఈ క్రమంలో గాలి అణువులు అయనీకరణకు గురవుతాయి. మెరుపు ఒకేసారి నేరుగా ప్రయాణించకుండా, చిన్న చిన్న దశల్లో ముందుకు సాగుతుంది. ఈ ప్రక్రియను శాస్త్రవేత్తలు ‘స్టెప్డ్ లీడర్’గా పిలుస్తారు. గాలిలో విద్యుత్ క్షేత్రం, తేమ వంటి పరిస్థితులు మారుతుండటంతో విద్యుత్ మార్గం వివిధ దిశల్లో విస్తరిస్తుంది. ఫలితంగా మెరుపులు జిగ్‌జాగ్ ఆకారంలో కనిపిస్తాయి.