ఆంధ్రప్రదేశ్‌లోని కోస్తా ప్రాంత రైతులు పండించిన బియ్యాన్ని చెన్నై పోర్టు ద్వారా ఎగుమతి చేయడంలో ఒక కొత్త రికార్డు నమోదైంది. శనివారం, ఒకే రోజు, ఒకే ఆర్డర్‌లో 2,700 టన్నుల బియ్యాన్ని ఎగుమతి చేసినట్లు కాంకర్ ఇన్‌లాండ్ కంటెయినర్ డిపో (ఐసీడీ) అధికారులు తెలిపారు. సామర్లకోట, తణుకు కేంద్రాల నుంచి 42 వ్యాగన్లలో బియ్యాన్ని తరలించి, తండియార్‌పేట డిపోలో కంటెయినర్లలోకి మార్చి, చెన్నై పోర్టు నుంచి చైనాకు ప్రత్యేక నౌకలో పంపించారు. గత నాలుగైదేళ్లుగా ఇంత పెద్ద ఎత్తున బియ్యం ఎగుమతులు జరగలేదని అధికారులు వెల్లడించారు.