ఖమ్మం జిల్లా ఖాజీపేట మండలం రావులపల్లి గ్రామ సచివాలయానికి 200 బస్తాల యూరియా మంజూరైంది. గురువారం ఉదయం 10 గంటల నుంచి ఒక్కో రైతుకు ఒక బస్తా చొప్పున పంపిణీ చేయనున్నట్లు అధికారులు తెలిపారు. అయితే, యూరియా కోసం రైతులు తెల్లవారుజాము నుంచే సచివాలయానికి చేరుకుని పాస్ పుస్తకాలు వరుసలో పెట్టి క్యూ కట్టారు. ఎరువుల కోసం తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని, అధికారులు స్పందించి సకాలంలో యూరియా అందేలా చర్యలు తీసుకోవాలని రైతులు కోరుతున్నారు.