గుర్రంకొండ మండలం ఖండ్రిగ టమోటా మార్కెట్ యార్డును బుధవారం జాయింట్ కలెక్టర్ శివనారాయణ శర్మ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా రైతులు తమ సమస్యలను వివరించారు. కొన్ని మండీ యాజమాన్యాలు ప్రతి 10 క్రేట్లకు ఒక క్రేట్ అదనంగా తీసుకుంటూ మోసం చేస్తున్నారని ఫిర్యాదు చేశారు. దీనిపై జేసీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ, నిబంధనలు ఉల్లంఘిస్తున్న మండీలపై తక్షణమే విచారణ చేపట్టి సంబంధిత యాజమాన్యాలకు నోటీసులు జారీ చేయాలని మార్కెట్ సెక్రటరీకి ఆదేశించారు. రైతులకు అన్యాయం జరగకుండా లావాదేవీలు పారదర్శకంగా నిర్వహించాలని సూచించారు.