ఏపీ పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల అమరావతి చట్టబద్ధతకు అసెంబ్లీ తీర్మానాన్ని హర్షించారు. అయితే, రాజధాని కోసం విభజన చట్టంలో పెట్టిన సెక్షన్ 94(3) సంగతేంటని చంద్రబాబును ప్రశ్నించారు. సెక్షన్ 5 సవరణకు కేంద్రం కోరడం న్యాయబద్ధమేనని, కానీ అమరావతి ఫండ్స్ అడిగేందుకు లేదా అని నిలదీశారు. విభజన చట్టానికి కేంద్రం తూట్లు పొడుస్తుంటే అసెంబ్లీ వేదికగా తీర్మానం చేయాలని, నిధులు హక్కుగా ఇవ్వాల్సిందేనని షర్మిల డిమాండ్ చేశారు. అమరావతి నిర్మాణానికి రూ.1 లక్ష కోట్లు ప్రజల నెత్తిమీద వేయాలా అని ప్రశ్నిస్తూ, కూటమి ప్రభుత్వం సమాధానం చెప్పాలని కోరారు.