తిరుపతిలో శ్రీ గోవిందరాజస్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా శనివారం రాత్రి అశ్వవాహన సేవ అత్యంత వైభవంగా జరిగింది. ఈ సేవలో శ్రీగోవిందరాజస్వామివారు కల్కి అవతార అలంకారంలో అశ్వవాహనంపై విహరించి భక్తులకు దర్శనమిచ్చారు. గజరాజుల నడక, కోలాటాలు, మంగళ వాయిద్యాలు, గోవింద నామస్మరణల మధ్య జరిగిన ఈ వాహన సేవ భక్తుల్లో ఆధ్యాత్మిక ఉత్సాహాన్ని నింపింది. భక్తులు అడుగడుగునా కర్పూర హారతులు సమర్పిస్తూ స్వామివారి దివ్య రూపాన్ని దర్శించుకుని పరవశించారు.