పొరుగు దేశం పాకిస్థాన్ తీవ్ర ఇంధన సంక్షోభంలో చిక్కుకుంది. పశ్చిమాసియాలో నెలకొన్న ఉద్రిక్తతల ప్రభావంతో అక్కడ ఎల్‌పీజీ ధరలు ఆకాశాన్నంటాయి. 11.67 కిలోల గ్యాస్ సిలిండర్ ధర రూ.3,150 నుంచి రూ.5,135 స్థాయికి పెరిగింది. ముఖ్యంగా పంజాబ్ ప్రావిన్స్‌లో ధరల పెరుగుదల ఎక్కువగా ఉంది. ఈద్, నౌరోజ్ సెలవుల కారణంగా ఇరాన్ నుంచి గ్యాస్ సరఫరా తగ్గడం, ఇంధన నిల్వలు అడుగంటడం సంక్షోభాన్ని తీవ్రతరం చేశాయి. దేశంలో కేవలం 11 రోజులకు సరిపడా ముడి చమురు, 27 రోజులకు పెట్రోల్, 21 రోజులకు డీజిల్, 9 రోజులకు ఎల్‌పీజీ నిల్వలు మాత్రమే ఉన్నాయని పెట్రోలియం శాఖ కార్యదర్శి తెలిపారు.