పిఠాపురంలో శనివారం జరిగిన జిల్లా స్థాయి ఆర్చరీ పోటీలలో పిఠాపురం ఆర్చర్స్ ఓవరాల్ ఛాంపియన్‌గా నిలిచారు. లిటిల్ సోల్జర్స్ హైస్కూల్ ప్రాంగణంలో ఈస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్ ఆర్చరీ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ పోటీలకు ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి 150 మంది బాలబాలికలు పాల్గొన్నారు. వీరిలో 52 మంది రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపికయ్యారు. వారు మార్చి 11న నూజివీడులో జరిగే రాష్ట్ర స్థాయి ఆర్చరీ పోటీల్లో పాల్గొననున్నారు. కార్యదర్శి పి. లక్ష్మణరావు ఈ వివరాలను వెల్లడించారు. పోటీలను కరస్పాండెంట్ గాయత్రి, ప్రిన్సిపాల్ మహేంద్రనాథ్ ప్రారంభించి బహుమతులు అందజేశారు.