గంజాయి, సారా మత్తులో దళితులపై దాడులు: టీడీపీ నేత ఖండన

1542చూసినవారు
తూర్పుగోదావరి జిల్లా రాజానగరం నియోజకవర్గం, సీతానగరం మండలం, ఇనుగంటివారిపేట గ్రామంలో యువత గంజాయి, నాటు సారా మత్తులో అమాయకులపై, ముఖ్యంగా దళితులపై దాడులకు పాల్పడుతున్నారని, అధికారులు తక్షణమే స్పందించి నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని తెలుగుదేశం పార్టీ జిల్లా ఎస్సీ సెల్ సెక్రెటరీ ఖండవల్లి లక్ష్మి డిమాండ్ చేశారు. శనివారం ఇనుగంటివారిపేటలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆమె మాట్లాడుతూ, అక్టోబర్ 24న కొందరు యువకులు గంజాయి, నాటు సారా సేవించి, అమ్మకాలు చేయరాదని అడిగినందుకు వేమగిరి సూరిబాబుపై దాడి చేసి కాలు విరగ్గొట్టారని, అలాగే ర్యాగింగ్ చేయవద్దని అడిగినందుకు ఇనుముర్తి జ్యోతిని కొట్టి చెయ్యి విరగ్గొట్టారని తెలిపారు. కొందరు నేతల అండతోనే ఈ దాడులు జరుగుతున్నాయని, స్థానిక దళితులను మత్తు పదార్థాల విక్రయాల్లో అండగా నిలుస్తూ, యువకులను రెచ్చగొట్టి అల్లర్లకు పాల్పడేలా చేస్తున్నారని ఆరోపించారు. ఈ దుర్మార్గాలపై రాష్ట్ర హోమ్ మినిస్టర్, మంత్రి నారా లోకేష్ దృష్టికి తీసుకుని వెళ్లి, బాధితులకు అండగా నిలబడతానని ఆమె స్పష్టం చేశారు. పోలీసులు న్యాయం చేయకపోతే నిరసన దీక్షలు చేపడతామని హెచ్చరించారు.

ట్యాగ్స్ :