రంపచోడవరం మండలం ఉట్ల అటవీ ప్రాంతంలో పెద్దపులి సంచారం స్థానికంగా ఆందోళన కలిగిస్తోంది. రెండు రోజులుగా పులి ఆనవాళ్లు కనిపించడంతో అడవికి అనుకోని గ్రామాలు ఉండటంతో అటవీ శాఖ అధికారులు అప్రమత్తమయ్యారు. ప్రత్యేక బృందాలు గాలింపు చర్యలు చేపడుతుండగా, రెస్క్యూ టీమ్ ఆధునిక పరికరాలతో పులి కదలికలను పర్యవేక్షిస్తోంది. రాత్రి వేళల్లో బయటకు వెళ్లవద్దని, గుంపులుగా తిరగాలని, పశువులను ఒంటరిగా మేతకు వదలవద్దని సూచించారు. పులి కనిపించినా, ఆనవాళ్లు గమనించినా వెంటనే అటవీ శాఖకు సమాచారం ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు.