డాక్టర్ బి. ఆర్. అంబేడ్కర్ కోనసీమ జిల్లాలో బుధవారం ఉదయం నుంచి వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. ఈదురు గాలులు, ఉరుములతో కూడిన జల్లులు పడుతుండటంతో వరి రైతులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. ప్రస్తుతం వరి పంట కోత దశకు చేరుకోవడం, భారీ వర్షాల హెచ్చరికలు ఉండటంతో రైతులు కలవరపడుతున్నారు. కళ్లాల్లో, జాతీయ రహదారులపై ఆరబోసిన ధాన్యం రాశులు వర్షానికి తడిచి దెబ్బతింటాయని వారు వాపోతున్నారు. ఆరబోసిన ధాన్యంపై బరకాలు కప్పుతూ, పంటను కాపాడుకునేందుకు రైతులు శతవిధాలా ప్రయత్నిస్తున్నారు.