మంగళవారం నాడు, డీఎస్పీ శ్రావణ్ కుమార్ విలేకరులతో మాట్లాడుతూ, మద్యం సేవించిన యువతి ఫిట్స్ తో అపస్మారక స్థితికి చేరుకుందని, ఆమెపై ఎలాంటి అఘాయిత్యం లేదా అత్యాచారం జరగలేదని స్పష్టం చేశారు. సోమవారం రాత్రి 112కు వచ్చిన సమాచారం మేరకు పోలీసులు కొత్తపేటలోని 12 పంపుల కూడలికి చేరుకుని, అపస్మారక స్థితిలో ఉన్న యువతిని ఆసుపత్రిలో చేర్పించారు. కోలుకున్నాక, ఆమె భర్తతో విభేదాల కారణంగా విడిపోయి, ఆరు నెలల పాపతో తల్లి వద్ద ఉంటున్నట్లు, పాప ఆరోగ్యం బాగోలేకపోవడంతో ఏలూరు వచ్చారని తెలిపారు. కూలి పనులు చేస్తూ మద్యానికి బానిసైన ఆమె, ఫిట్స్ తో పడిపోవడంతో కొందరు యువకులు అక్కడి నుంచి వెళ్లిపోయారని, సీసీ కెమెరాల పరిశీలనలో కూడా అత్యాచారం జరిగినట్లు ఆధారాలు లేవని డీఎస్పీ వెల్లడించారు.