ఏలూరు ప్రభుత్వ మెడికల్ కళాశాలలో ర్యాగింగ్ భూతం కలకలం రేపుతోంది. సీనియర్ల వేధింపులు భరించలేక జూనియర్ విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. గత నెల 12న ఫ్రెషర్స్ డే సందర్భంగా మొదలైన ఘర్షణ సోమవారం అర్ధరాత్రి దాడులకు దారితీసింది. ద్వితీయ సంవత్సరం విద్యార్థులు తమను 16 మంది సీనియర్లు వేధిస్తున్నారని రాతపూర్వకంగా ఫిర్యాదు చేయడంతో, వారిని హాస్టల్ నుంచి సస్పెండ్ చేశారు. డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ విచారణకు ఆదేశించగా, ప్రిన్సిపాల్ పర్యవేక్షణలో విచారణ కమిటీ బుధవారం నుంచి విచారణ ప్రారంభించనుంది. పోలీసులు రంగ ప్రవేశం చేసి ఇరు వర్గాల విద్యార్థులకు కౌన్సెలింగ్ ఇచ్చి, భవిష్యత్తు నాశనం అవుతుందని హెచ్చరించారు.