ఏపీలో బంగారు ఖనిజ నిక్షేపాల గుర్తింపు, తవ్వకాలపై గనుల శాఖ ప్రత్యేక దృష్టి సారించింది. రాష్ట్రవ్యాప్తంగా లక్షన్నర హెక్టార్లకు పైగా విస్తీర్ణంలో బంగారు నిక్షేపాలు ఉండే అవకాశం ఉందని ప్రాథమిక అంచనాలు వెల్లడయ్యాయి. ఇప్పటికే కర్నూలు జిల్లా జొన్నగిరిలో బంగారు తవ్వకాలు కొనసాగుతుండగా, అన్నమయ్య, చిత్తూరు, ప్రకాశం, శ్రీ సత్యసాయి జిల్లాల్లో కూడా అన్వేషణ చేపట్టేందుకు ప్రణాళిక సిద్ధమైంది. జీ-1 నుంచి జీ-4 వరకు నాలుగు దశల్లో సర్వేలు, తవ్వకాలు నిర్వహించనున్నారు. జాతీయ ఖనిజ అన్వేషణ అభివృద్ధి నిధి (NMET) సహకారంతో ఈ ప్రక్రియ సాగనుంది.