ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 2026-27 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన బడ్జెట్ కసరత్తు ముమ్మరంగా సాగుతోంది. ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ నేతృత్వంలో అధికారులు ఈ ప్రక్రియను వేగవంతం చేశారు. ఈనెల 14వ తేదీన మంత్రి ఏపీ అసెంబ్లీలో బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్నారు. ఇప్పటివరకు ఐదు శాఖల మంత్రులతో ప్రీ-బడ్జెట్ సమావేశాలు పూర్తయ్యాయి. సంక్షేమం, అభివృద్ధికి సమపాళ్లలో నిధులు కేటాయించేలా కసరత్తు జరుగుతోంది. ఇరిగేషన్ ప్రాజెక్టులు, ఉత్తరాంధ్ర-రాయలసీమ ప్రాంతాల అభివృద్ధి, రాజధాని అమరావతి నిర్మాణం, పారిశ్రామిక రంగానికి అధిక ప్రాధాన్యత ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. తల్లికి వందనం, దీపం-2.0, అన్నదాత సుఖీభవ, స్త్రీ శక్తి, ఎన్టీఆర్ భరోసా పెన్షన్లు వంటి సంక్షేమ పథకాలకు ప్రత్యేక నిధులు కేటాయించే అవకాశం ఉంది.