అమరావతికి చట్టబద్ధత: లోక్‌సభలో బిల్లు ఆమోదం

482చూసినవారు
అమరావతికి చట్టబద్ధత: లోక్‌సభలో బిల్లు ఆమోదం
ఆంధ్రప్రదేశ్‌ శాశ్వత రాజధానిగా అమరావతికి చట్టబద్ధత కల్పిస్తూ కేంద్రం ప్రవేశపెట్టిన రాష్ట్ర పునర్విభజన చట్ట సవరణ బిల్లుకు లోక్‌సభ ఆమోదం తెలిపింది. 2024 జూన్‌ 2 నుంచి అమరావతిని రాష్ట్ర రాజధానిగా చట్టం ద్వారా గుర్తిస్తున్నట్లుగా ఈ బిల్లులో పేర్కొన్నారు. కేంద్ర హోం శాఖ సహాయమంత్రి నిత్యానంద రాయ్‌ ప్రవేశపెట్టిన ఈ బిల్లుపై దాదాపు రెండు గంటలపాటు చర్చ జరిగింది. ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్‌ సహా 11 పార్టీలకు చెందిన 18 మంది ఎంపీలు ఇందులో పాలుపంచుకున్నారు. బిల్లును వ్యతిరేకిస్తున్నట్లు ప్రకటించిన వైసీపీ ఎంపీలు సభ నుంచి వాకౌట్‌ చేశారు. ఆ తర్వాత బిల్లును మూజువాణి ఓటుతో సభ ఆమోదించింది. గురువారం రాజ్యసభ ముందుకు ఈ బిల్లు రానుంది. అక్కడ ఆమోదం పొందడం కూడా లాంఛనమే. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆమోదం లభించగానే చట్టరూపం దాలుస్తుంది. కాంగ్రెస్‌, ఇతర ఇండీ కూటమి పార్టీలు, ఎన్‌డీఏ పార్టీలన్నీ ముక్తకంఠంతో అమరావతి రాజధానికి చట్టబద్ధతను స్వాగతించాయి. వైసీపీ ఒక్కటే వ్యతిరేకించింది. రాజధానికి భూములిచ్చిన రైతుల ప్రయోజనాలకు బిల్లులో ప్రాధాన్యం లేదని వైసీపీ లోక్‌సభా పక్ష నేత మిథున్‌రెడ్డి అన్నారు.

సంబంధిత పోస్ట్