మాచర్ల పట్టణంలో చికిత్స కోసం ఆసుపత్రికి వచ్చిన మహిళ మృతి చెందగా, ఆమె చేతికి ఉన్న బంగారు గాజు కనిపించకపోవడం కలకలం రేపింది. రెంటచింతల మండలం మంచికల్లు గ్రామానికి చెందిన నెమలి భ్రమరాంబ గుండె నొప్పితో ఆదివారం రాత్రి మాచర్లలోని ప్రైవేట్ ఆసుపత్రిలో చేరి చికిత్స పొందుతూ మరణించారు. అనంతరం మృతదేహాన్ని ఇంటికి తీసుకెళ్లిన కుటుంబసభ్యులు ఆమె చేతికి ఉన్న బంగారు గాజు ఒకటి లేకపోవడం గుర్తించారు. ఈ విషయంపై ఆసుపత్రి సిబ్బందిని సంప్రదించినా సరైన స్పందన లభించకపోవడంతో బాధితులు పోలీసులను ఆశ్రయించారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పట్టణ పోలీసులు తెలిపారు.