ప్రస్తుత జీవనశైలిలో ఉద్యోగ, వ్యాపార, వ్యవసాయ, ఇతర ఉపాధుల రీత్యా పిల్లలు తల్లిదండ్రులకు దూరంగా ఉంటున్నారని, అలాంటి వృద్ధుల కోసం ఎన్టీఆర్ భరోసా పెన్షన్ ఒక ఆసరాగా నిలుస్తుందని జిల్లా కలెక్టర్ డాక్టర్ వి. వినోద్ కుమార్ అన్నారు. ఇంకొల్లు పంచాయతీ కార్యాలయం వద్ద జరిగిన పేదల సేవ బహిరంగ సభలో ఆయన మాట్లాడుతూ, పిల్లలు నెలలో కనీసం రెండు మూడు రోజులైనా తల్లిదండ్రుల వద్దకు వచ్చి వారిని ఆప్యాయంగా పలకరించి, వారి సమస్యలు తెలుసుకోవాలని సూచించారు. ఈ సందర్భంగా ఆయన స్థానిక శాసనసభ్యులు ఏలూరి సాంబశివరావుతో కలిసి ఇంకొల్లు పంచాయతీ ఆవరణలో ఏర్పాటు చేసిన ప్రజావేదిక కార్యక్రమాన్ని ప్రారంభించారు. పర్చూరు రోడ్డు సమస్యను అధికారులతో మాట్లాడి త్వరలో పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు.