ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలల్లో పనిచేస్తున్న శానిటేషన్ (ఆయా) కార్మికుల పెండింగ్ వేతనాలు వెంటనే చెల్లించాలని, వేతనాలు పెంచాలని, వారి సమస్యలు పరిష్కరించాలని కోరుతూ సీఐటీయూ ఆధ్వర్యంలో డీఈఓ ఇంచార్జి శ్రీ రామ్ గార్కి వినతిపత్రం అందించారు. సీఐటీయూ జిల్లా కార్యదర్శి చంద్రమళ పద్మ మాట్లాడుతూ, అట్టడుగు వర్గాలకు చెందిన ఈ కార్మికులు తక్కువ వేతనాలతో పనిచేస్తున్నారని, 50 మంది విద్యార్థులకు ఒక ఆయాను నియమించాలని, ప్రమాద బీమా, ఈఎస్ఐ, ఉద్యోగ భద్రత కల్పించాలని డిమాండ్ చేశారు. నెలల తరబడి వేతనాలు పెండింగ్ ఉండటంతో కుటుంబ పోషణ కష్టమవుతోందని, గ్లౌజులు, మాస్కులు, యూనిఫాం ఇవ్వాలని, వేసవి సెలవుల్లో పనిచేసిన వారికి పూర్తి జీతం చెల్లించాలని కోరారు. ఫిబ్రవరి 2న కాకినాడ కలెక్టర్ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహిస్తున్నామని, అందరూ పాల్గొని జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు.