కందుకూరి రాజ్యలక్ష్మి ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాలలో 04/02/26న వరల్డ్ క్యాన్సర్ డే సందర్భంగా క్యాన్సర్ అవగాహన కార్యక్రమం జరిగింది. ముఖ్య అతిథిగా హాజరైన ప్రముఖ ఆంకాలజిస్ట్ డాక్టర్ విశ్వనాథ్ పట్నాల, క్యాన్సర్ ప్రపంచవ్యాప్తంగా మరణాలకు ప్రధాన కారణమని, అయితే సరైన అవగాహన, ముందస్తు గుర్తింపు, సకాలంలో చికిత్సతో జయించవచ్చని తెలిపారు. జీవనశైలి, ఆహారపు అలవాట్లు, వ్యాయామం లేకపోవడం వంటి కారణాల వల్ల క్యాన్సర్ పెరుగుతుందని, యువత ఆరోగ్యంపై శ్రద్ధ వహించాలని సూచించారు. మహిళల్లో బ్రెస్ట్, సర్వైకల్ క్యాన్సర్లను ప్రారంభ దశలోనే గుర్తిస్తే నయం చేయవచ్చని, రెగ్యులర్ హెల్త్ చెకప్‌లు తప్పనిసరి అని అన్నారు. లక్షణాలు కనిపించినప్పుడు భయపడకుండా వైద్యులను సంప్రదించాలని, ఆధునిక వైద్యంపై నమ్మకం ఉంచాలని సూచించారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులు అడిగిన సందేహాలకు సమాధానాలు ఇచ్చారు. ఈ కార్యక్రమం విద్యార్థుల్లో ఆరోగ్య చైతన్యం పెంపొందించింది.