ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యంగా తీసుకున్న పథకాలు, కార్యక్రమాలను పక్కా ప్రణాళికలతో అమలు చేయాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు (AP CM Chandra babu Naidu) అధికారులకు దిశానిర్దేశం చేశారు. ప్రభుత్వ పథకాలను ప్రజలకు చేరువ చేయడంతోపాటు.. సంతృప్తి కలిగించే రీతిలో సేవలు అందించినప్పుడే మంచి ఫలితాలు వస్తాయని పేర్కొన్నారు. నిర్దేశించుకున్న లక్ష్యాలను చేరుకునే విషయంలో ఎలాంటి జాప్యం జరగకూడదని ఆదేశించారు. ఈరోజు (మంగళవారం) ఆర్టీజీస్ నుంచి వివిధ శాఖల పనితీరుపై సీఎం సమీక్షించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ... ఈ ఏడాదిలో మరోసారి సామూహిక గృహ ప్రవేశాల కార్యక్రమం చేపట్టాలని నిర్ణయించుకున్నామని తెలిపారు. ఆ దిశగా గృహ నిర్మాణ శాఖ వేగంగా పనిచేయలని మార్గనిర్దేశం చేశారు. టిడ్కో ఇళ్లు కాకుండానే మరో 5 లక్షలకు ఇళ్ల నిర్మాణాన్ని పూర్తి చేసి లబ్ధిదారులకు అందించాలని ఆదేశించారు.