ఆంధ్రప్రదేశ్ కు చెందిన ప్రముఖ పోలీస్ ఉన్నతోద్యోగి శ్రీ చదలవాడ ఉమేశ్ చంద్ర జయంతి వారోత్సవాల సందర్భంగా డోన్ పట్టణంలో ఎమ్మెల్యే ఆఫీస్ నందు డోన్ శాసనసభ్యులు కోట్ల జయసూర్య ప్రకాష్ రెడ్డి అధ్యక్షతన, సామాజిక కార్యకర్త పి. మహమ్మద్ రఫి ఆధ్వర్యంలో ఆయన చిత్రపటానికి పూలమాల వేసి ఆదివారం ఘనంగా నివాళులర్పించారు. దివంగత ఉమేష్‌చంద్ర ప్రతి పోలీసు, అధికారికి ఆదర్శప్రాయుడని, ప్రజా సమస్యలను తన సమస్యలుగా భావించే క్రమశిక్షణ కలిగిన అధికారిగా పేరు తెచ్చుకున్నారని, దుర్మార్గుల తూటాలకు బలైనప్పటికీ తెలుగు ప్రజల హృదయాలలో చిరస్మరణీయంగా నిలిచిపోయారని వారు కొనియాడారు. సమాజానికి సేవ చేసిన మహనీయులను స్మరించుకుంటూ వారి అడుగుజాడల్లో నడవాలని వారు కోరారు.