మహిళలపై జరుగుతున్న నేరాల నివారణ, భద్రతపై అవగాహన కల్పించేందుకు చేపట్టిన "ఆపరేషన్ దండయాన" కార్యక్రమంలో భాగంగా గురువారం కోడుమూరులో పోస్టర్లను కర్నూలు జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ ఆవిష్కరించారు. ఎమ్మిగనూరు రోడ్డులోని శ్రీవాసవి కళ్యాణ మండపంలో జరిగిన కార్యక్రమంలో మహిళల భద్రత, చట్టాలపై అవగాహన సదస్సు నిర్వహించారు. మహిళలపై నేరాల నివారణకు పోలీసు శాఖ నిరంతరం అవగాహన కార్యక్రమాలు చేపడుతోందని, పోక్సో చట్టం సహా వివిధ చట్టాలపై యువతకు అవగాహన అవసరమని ఎస్పీ తెలిపారు. మహిళలు ఎలాంటి సమస్య వచ్చినా భయపడకుండా పోలీసులను సంప్రదించాలని, ఫిర్యాదు చేసిన వారి వివరాలు గోప్యంగా ఉంచుతామని ఆయన స్పష్టం చేశారు.