మద్దికేర మండలం పెరవలిలోని శ్రీభూదేవి రాజ్యలక్ష్మి సమేత శ్రీరంగనాథస్వామి ఆలయానికి బహిరంగ వేలం పాటల ద్వారా రూ. 1,07,000 అదనపు ఆదాయం లభించింది. ఆలయ ఈఓ రెబ్బా వీరయ్య తెలిపిన వివరాల ప్రకారం, బుధవారం ఆలయ ఆవరణలో తలనీలాలను ప్రోగు చేసుకునేందుకు నిర్వహించిన వేలం పాటలో ఏడాది కాలానికి సంబంధించిన హక్కుల కోసం 14 మంది పోటీపడ్డారు. అనంతపురానికి చెందిన మారెన్న రూ. 10,25,000లకు హక్కు దక్కించుకున్నారు. గత ఏడాది రూ. 8,48,000 రాగా, ఈసారి అధిక ఆదాయం సమకూరిందని ఆయన పేర్కొన్నారు.