ఆరుద్రా నక్షత్రాన్ని పురస్కరించుకుని శ్రీస్వామిఅమ్మవార్లకు స్వర్ణరథోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. ఈ సందర్భంగా వేకువజామున మహాన్యాసపూర్వక ఏకాదశ రుద్రాభిషేకం, అన్నాభిషేకం, విశేష పూజలు నిర్వహించారు. దేశ శాంతి, సౌభాగ్యం, ప్రకృతి వైపరీత్యాల నివారణ, ప్రజల ఆయురారోగ్యాలు, సుఖశాంతుల కోసం అర్చకులు లోకకల్యాణాన్ని కాంక్షిస్తూ సంకల్పాన్ని పఠించారు. ఉదయం 7.30 గంటలకు రథారూఢులైన శ్రీస్వామిఅమ్మవార్లకు విశేష పూజల అనంతరం భక్తుల శివనామ స్మరణతో రథోత్సవం ప్రారంభమైంది. గంగాధర మండపం నుంచి నంది మండపం వరకు జరిగిన ఈ ఉత్సవంలో కోలాటం, తప్పెట చిందులు వంటి జానపద కళారూపాలు, సాంప్రదాయ నృత్యాలు ప్రదర్శించారు. ఈ కార్యక్రమంలో ధర్మకర్తల మండలి అధ్యక్షుడు, కార్యనిర్వహణాధికారి, సభ్యులు, అర్చకులు, అధికారులు పాల్గొన్నారు.