తూర్పు గోదావరి జిల్లా రాజానగరం నియోజకవర్గంలో మైనింగ్ మాఫియా రెచ్చిపోతోందని ఆరోపణలు వినిపిస్తున్నాయి. నలుగురైదుగురు కూటమి నేతలు ముఠాలుగా ఏర్పడి కొండలను ధ్వంసం చేస్తున్నారని స్థానికులు చెబుతున్నారు. జనసేన ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ అనుచరులు ఆయన అండతో అక్రమాలకు పాల్పడుతున్నారని, ఎమ్మెల్యే హెచ్చరికలు మాటలకే పరిమితమవుతున్నాయని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. రాజానగరం, సీతానగరం, కోరుకొండ మండలాల్లో పలు కొండలు ఇప్పటికే కరిగిపోయాయని, రాత్రింబవళ్లు తవ్వకాలు కొనసాగుతున్నప్పటికీ అధికారులు చూడనట్లు వ్యవహరిస్తున్నారని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.