ఆదోనిని జిల్లాగా ప్రకటించాలని డిమాండ్ చేస్తూ ఆదోని జిల్లా సాధన జాయింట్ యాక్షన్ కమిటీ ఆధ్వర్యంలో బహుజన్ సమాజ్ పార్టీ కార్యకర్తలు దీక్ష చేపట్టారు. స్వాతంత్ర్యం వచ్చినప్పటి నుండి కర్నూలుకు పశ్చిమాన ఉన్న ఆదోని ప్రాంతం విద్య, వైద్యం, ఉపాధి రంగాల్లో వెనుకబడి ఉందని, ప్రాజెక్టుల నిర్మాణంలో, తాగునీటి సరఫరాలో నిర్లక్ష్యం వహించారని, రాజకీయ నాయకులు స్వలాభం కోసం పనిచేస్తున్నారని పార్టీ నాయకులు మంచాల లక్ష్మీనారాయణ, బోయ రవికుమార్ ఆరోపించారు. ఆదోని జిల్లా ఏర్పాటు చేస్తే పరిశ్రమలు వచ్చి, వలసలు తగ్గి, స్థానికులకు ఉపాధి లభిస్తుందని, ఇది రాయలసీమ పశ్చిమ ప్రాంత అభివృద్ధికి దోహదపడుతుందని వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో వివిధ పార్టీల నాయకులు సంఘీభావం తెలిపారు.