కర్నూలు నగరంలో డ్రైనేజీ కాలువల్లో చెత్త వేయడం వల్ల వర్షపు నీటి పారుదల దెబ్బతిని రహదారులు జలమయమవుతున్నాయని నగరపాలక సంస్థ కమిషనర్ చల్లా ఓబులేసు తెలిపారు. శనివారం వర్షం అనంతరం పలు ప్రాంతాల్లో కాలువలను పరిశీలించి వ్యర్థాల తొలగింపు పనులను పర్యవేక్షించారు. ఓల్డ్ కల్లూరు వక్కెర వాగులో చెత్త వేస్తున్న డైమండ్ ఫంక్షన్ హాల్‌కు రూ. 10 వేల జరిమానా విధించారు. కాలువల్లో చెత్త పేరుకుపోవడం వల్ల దోమల వ్యాప్తి, పారిశుద్ధ్య సమస్యలు పెరుగుతాయని హెచ్చరిస్తూ, ప్రజలు చెత్తను సేకరణ వాహనాలకు మాత్రమే అందించాలని సూచించారు. కాలువలు, వాగుల్లో వ్యర్థాలు వేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.