అమరావతి రాజధాని తీర్మానాన్ని శాసనమండలిలో ఎందుకు చర్చకు పెట్టలేదని వైఎస్సార్సీపీ కర్నూలు జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే ఎస్వీ మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. సోమవారం కర్నూలులో ఆయన మాట్లాడుతూ, మండలిలో చర్చిస్తే అవినీతి అంశాలపై ప్రశ్నలు ఎదుర్కోవాల్సి వస్తుందనే భయంతో ప్రభుత్వం ఈ అంశాన్ని తప్పించుకుందా అని నిలదీశారు. ఏదైనా బిల్లు ఆమోదం పొందాలంటే శాసనసభతో పాటు శాసనమండలిలో కూడా ఆమోదం తీసుకుని గవర్నర్ ద్వారా కేంద్రానికి పంపాల్సి ఉంటుందని పేర్కొన్నారు. అమరావతిలో శాశ్వత భవనాలు నిర్మించలేదని, సేకరించిన వేల ఎకరాల భూములకు సంబంధించి రైతులకు హామీ ఇచ్చిన ప్లాట్ల వివరాలు ఎక్కడున్నాయని ఆయన ప్రశ్నించారు.