కౌతాళం మండలంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయుడిపై అవినీతి ఆరోపణల విషయంలో అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని ఏఐఎస్ఎఫ్ జిల్లా ఉపాధ్యక్షుడు యస్. ఈరేష్ ఆగ్రహం వ్యక్తం చేశారు. బుధవారం ఆయన మాట్లాడుతూ, ఏఐఎస్ఎఫ్ ఆందోళనల నేపథ్యంలో ఉన్నతాధికారులు డిప్యూటీ డీఈఓను విచారణకు నియమించినా, అది కేవలం పేరుకే జరిగిందని విమర్శించారు. పదో తరగతి పరీక్షల సమయంలో డిప్యూటీ డీఈఓ, ప్రధానోపాధ్యాయుడు గైర్హాజరులో తూతూ మంత్రంగా విచారణ జరిపారని ఆరోపించారు. విచారణ జరిగి రోజులు గడుస్తున్నా నివేదిక వెలువరించకపోవడం అనుమానాలకు తావిస్తోందని తెలిపారు.