రాయచూరు జిల్లా మాన్వి తాలూకా కురిడి గ్రామానికి చెందిన నలుగురు తుంగభద్ర నదిలో స్నానానికి వెళ్లి లోతైన నీటిలో మునిగి మృతి చెందిన విషాద సంఘటన చోటుచేసుకుంది. శుక్రవారం ఈ ఘటనపై మంత్రాలయం టీడీపీ ఇంచార్జి ఎన్. రాఘవేంద్ర రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసి, మృతుల కుటుంబాలకు తన ప్రగాఢ సంతాపం తెలిపారు. కోసిగి మండలం కందుకూరు గ్రామంలో జరిగిన వివాహానికి హాజరైన వీరు, కందుకూరు–అగసనూరు గ్రామాల మధ్య నదిలో స్నానం చేస్తుండగా ఈ దుర్ఘటన జరిగింది. లోతైన నీటిలోకి వెళ్లిన ఇద్దరు మహిళలు, ఇద్దరు యువకులు ప్రమాదవశాత్తు మునిగిపోగా, స్థానికులు గాలించి బయటకు తీసేలోపే మృతి చెందారు.