కృష్ణానదికి అనూహ్యంగా వరద తాకిడి పెరగడంతో ఆదివారం ప్రకాశం బ్యారేజ్ వద్ద జిల్లా అధికార యంత్రాంగం మొదటి ప్రమాద హెచ్చరికను ప్రకటించింది. ఉదయం 9 గంటలకు బ్యారేజ్ వద్ద నీటిమట్టం 14.7 అడుగులకు చేరుకోవడంతో, బ్యారేజీలోని అన్ని గేట్లను ఎత్తి 5,53,654 క్యూసెక్కుల నీటిని సముద్రంలోకి విడుదల చేశారు. డెల్టా సాగునీటి అవసరాల నిమిత్తం కృష్ణా తూర్పు, పశ్చిమ ప్రధాన పంట కాలువలకు 8,836 క్యూసెక్కుల సాగునీటిని విడుదల చేస్తున్నారు.