విట్ యూనివర్సిటీ కాన్వకేషన్‌లో సుప్రీంకోర్ట్ మాజీ ప్రధాన న్యాయమూర్తి ఎన్వీ రమణ సంచలన వ్యాఖ్యలు చేశారు. అమరావతి నగరం రైతుల కష్టం, వారి త్యాగంపై నిర్మింపబడుతోందన్నారు. స్వాతంత్ర్యం తర్వాత అతి సుదీర్ఘంగా రాజధాని అమరావతి కోసం ఇక్కడి రైతులు పోరాటం చేశారని, న్యాయవ్యవస్థపై రైతులు నమ్మకం ఉంచినందుకు ధన్యవాదాలు తెలిపారు. తన కుటుంబాన్ని కూడా టార్గెట్ చేసి క్రిమినల్ కేసులు పెట్టారని ఆయన షాకింగ్ కామెంట్స్ చేశారు. మహాకవి శ్రీశ్రీ కవిత్వాన్ని ప్రస్తావిస్తూ, అమరావతి నిర్మాణానికి రాళ్లెత్తిన కూలీలెవ్వరు అంటూ తనదైన శైలిలో అన్వయించారు. నాటి నిర్ణయాల వల్ల అమరావతి అనేక కష్టాలకు గురైందని, కష్టకాలంలో విట్ లాంటి యూనివర్సిటీ నిలబడిందని, చుట్టప్రక్కల గ్రామాల ప్రజల స్కూలింగ్‌కు, ఆసుపత్రులకు విట్ సహకరిస్తుందని చెప్పారు. ఈ ప్రాంతం మొత్తం తనకు తెలుసని, అప్పట్లో ఎమర్జన్సీ సమయంలో కృష్ణానదిలో ఉన్న దిబ్బలపై రహస్య సమావేశాలు పెట్టుకున్నామంటూ ఆనాటి సంఘటనలను ఎన్వీ రమణ గుర్తుచేసుకున్నారు.