ప్రభుత్వ వైద్యుల అనధికార సెలవులపై ఏపీ సర్కార్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. 51 మందిపై కఠిన చర్యలకు ఉపక్రమించింది. వైద్యుల బాధ్యతారాహిత్యాన్ని ఏమాత్రం ఉపేక్షించే ప్రసక్తే లేదని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలో రాష్ట్రవ్యాప్తంగా 51 మంది బోధనాసుపత్రి (టీచింగ్ హాస్పిటల్) వైద్యులను ప్రభుత్వం విధుల నుంచి తొలగిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ తొలగింపునకు గురైన వారిలో వివిధ హోదాలకు చెందిన వైద్యులు ఉన్నారు. వీరిలో 8 మంది అసోసియేట్ ప్రొఫెసర్లు, 41 మంది అసిస్టెంట్ ప్రొఫెసర్లు, ఇద్దరు ట్యూటర్లు ఉన్నారు. త్వరలోనే మరో ముగ్గురు ప్రొఫెసర్లపై కూడా ఇటువంటి చర్యలు తీసుకునేందుకు ప్రభుత్వం సిద్ధమవుతోంది. విధులకు గైర్హాజరైన వారిలో కాకుండా, మరో 33 మంది వైద్యులకు ప్రభుత్వం ఛార్జిమెమోలు జారీ చేసింది. వైద్య సేవలకు ఎటువంటి ఆటంకం కలగకూడదనే ఉద్దేశంతోనే ఈ కఠిన నిర్ణయాలు తీసుకున్నట్లు అధికారులు తెలిపారు.