ఆస్తి వివాదాల నేపథ్యంలో సొంత పిన్ని, ఆమె ఇద్దరు పిల్లలను దారుణంగా హత్య చేసిన కేసులో తండ్రీకొడుకులకు గుంటూరు జిల్లా ప్రధాన న్యాయమూర్తి బి. సాయికల్యాణచక్రవర్తి జీవిత ఖైదు, జరిమానా విధించారు. సత్తెనపల్లి మండలం ధూళిపాళ్లకు చెందిన షేక్ ఖాసిమ్, అతని కుమారుడు జాకీర్, రూ.5 వేల అప్పు, భూమి విషయమై వివాదాలు పెంచుకుని, 2023 జులై 5న షేక్ రహిమూన్ (63), ఆమె కుమార్తె మాలినీబీ (32), కుమారుడు అబ్దుల్ రెహ్మాన్ (36)లను గొంతు నులిమి, కత్తులతో పొడిచి హత్య చేశారు. కేసు దర్యాప్తు అనంతరం పోలీసులు ఛార్జిషీట్ దాఖలు చేయగా, ఖాసిమ్, జాకీర్లపై నేరం రుజువు కావడంతో వారికి జీవిత ఖైదు, రూ.2,500 జరిమానా విధించారు. అయితే, భార్య సుఫియాపై నేరం రుజువు కాకపోవడంతో ఆమెపై కేసు కొట్టివేశారు.