కుటుంబానికి అండగా నిలవాలనే ఆశతో ఉపాధి కోసం వెళ్లిన జీలకర్ర జగదీష్ (18) అనే యువకుడు విద్యుదాఘాతంతో మృతిచెందిన ఘటన గుమ్మలక్ష్మీపురం మండలంలో విషాదాన్ని నింపింది. వనకాబడి గ్రామానికి చెందిన జగదీష్, మూడు నెలల క్రితం భీమవరం సమీపంలోని చేపల చెరువులో పనికి వెళ్ళాడు. శుక్రవారం రాత్రి విద్యుత్ సరఫరాలో అంతరాయం ఏర్పడడంతో తీగలు సరిచేస్తుండగా షాక్‌కు గురై అక్కడికక్కడే మృతిచెందాడు. శనివారం మృతదేహాన్ని స్వగ్రామానికి తీసుకువచ్చి అంత్యక్రియలు నిర్వహించారు. తల్లిని కోల్పోయిన జగదీష్ కుటుంబానికి అండగా నిలుస్తాడని ఆశించిన తండ్రి, అన్నయ్య తీవ్ర విషాదంలో మునిగిపోయారు.