స్థానిక టిడిపి కార్యాలయంలో శనివారం యుటిఎఫ్ నాయకులు ఎమ్మెల్యే బోనెల విజయచంద్రను కలిసి ఉపాధ్యాయులు, ఉద్యోగుల ఆర్థిక బకాయిల చెల్లింపునకు పరిష్కారం చూపాలని కోరారు. ఫిబ్రవరి 11 నుంచి ప్రారంభం కాబోయే రాష్ట్ర బడ్జెట్ సమావేశాల్లో ఉద్యోగ ఉపాధ్యాయుల ఆర్థిక అంశాలపై ఎమ్మెల్యేగా ప్రత్యేకంగా చర్చించాలని విజ్ఞప్తి చేశారు. 12వ పిఆర్సి కాలం ఇప్పటికే 32 నెలలు గడిచిపోయిందని, ఆలస్యం చేయకుండా చైర్మన్ను నియమించి, 29% మధ్యంతర భృతిని ప్రకటించాలని, 30 వేల కోట్ల బకాయిల చెల్లింపునకు రోడ్ మ్యాప్ విడుదల చేయాలని యుటిఎఫ్ నాయకులు కోరారు. ఎమ్మెల్యే విజయచంద్ర స్పందిస్తూ, గత ప్రభుత్వం ఉపాధ్యాయుల సమస్యలను పట్టించుకోలేదని, కూటమి ప్రభుత్వం దశలవారీగా పరిష్కరిస్తుందని, బడ్జెట్ సమావేశాల్లో సమస్యలు ప్రస్తావించి పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు.