జమ్ముకశ్మీర్ ఆరోగ్య శాఖలో ఊహించని పరిణామం తీవ్ర కలకలం రేపింది. అధికారిక కార్యక్రమానికి సంబంధించిన ఒక కరపత్రంలో 'పోలియో ఫ్రీ పాకిస్తాన్' అనే నినాదం కనిపించడంతో అధికారులు ఉలిక్కిపడ్డారు. రాజౌరి చీఫ్ మెడికల్ ఆఫీసర్ (సీఎంఓ) పల్స్ పోలియో ఇమ్యునైజేషన్ ప్రోగ్రామ్-2026కు సంబంధించిన ఈ వివాదాస్పద కరపత్రంపై ఉన్నతాధికారులు అత్యవసర విచారణకు ఆదేశించారు. బ్లాక్ మెడికల్ ఆఫీసర్ (బీఎంఓ) కార్యాలయం ద్వారా ప్రచురితమైన ఈ పత్రంపై సదరు బీఎంఓకు షోకాజ్ నోటీసు జారీ చేసి, 24 గంటల్లోగా వివరణ ఇవ్వాలని ఆదేశించారు. ఈ లోగో, నినాదానికి జమ్ముకశ్మీర్ ఆరోగ్య సంరక్షణ, వైద్య విద్యా విభాగంతో కానీ, కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖతో కానీ ఎలాంటి సంబంధం లేదని ప్రభుత్వం స్పష్టం చేసింది.