జిల్లాపై మొంథా తుఫాన్ పంజా విసిరింది. జలప్రళయాన్ని సృష్టిం చింది. జిల్లావ్యాప్తంగా భారీ వర్షాలు పడగా తూర్పు, దక్షిణ ప్రాంతాల్లో కుండపోత కురిసింది. కేవలం 36 గంటల్లో ఏకంగా 18.4 మి.మీ వర్షపాతం నమోదైంది. ఫలితంగా బుధవారం ఉదయం జిల్లాలో ఎటు చూసినా నీరే కనిపించింది. వాగులు, వంకలు, కాలువలు, చెరువులు, నదులు ఏకమైనట్లుగా పరిస్థితి నెలకొంది. దాదాపు లక్ష ఎకరాల్లో పంటలు నీట మునిగి దాదాపు రూ.250 కోట్ల మేర రైతులు నష్ట పోయే పరిస్థితి ఏర్పడింది. మరోవైపు వాగులు, వంకలు పొంగడంతో ప్రధాన మార్గాల్లో సైతం రవాణా నిలిచిపో యింది. అనేక గ్రామాలు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. దాదాపు వంద కుపైగా గ్రామాలు, కాలనీలు జలమయమై వేలాది ఇళ్లలోకి నీరు చేరింది. మరోవైపు చెరువులన్నీ నిండటంతోపాటు పలుచోట్ల గండ్లు పడ్డాయి. రోడ్లు చాలాచోట్ల ధ్వంసమయ్యాయి. పల్లె, పట్టణం తేడా లేకుండా పారి శుధ్య పరిస్థితి అధ్వానంగా మారింది.