జిల్లాకు దిత్వా తుఫాన్ ముప్పు తప్పినప్పటికీ దానివల్ల నెలకొన్న మంగు వాతావరణం రైతులను ఆందోళనకు గురిచేస్తోంది. నాలుగు రోజులుగా చిరుజల్లులు, చలిగాలులతో కూడిన తేమ వాతావరణం కొనసాగుతోంది. దీంతో పైర్లపై తెగుళ్ల దాడి, పురుగుల ఉధృతి అధికమైంది. జిల్లాలో ఖరీఫ్ సీజన్‌లో సుమారు 2 లక్షల ఎకరాల్లో వివిధ రకాల పంటలు సాగు చేశారు. నువ్వు, సజ్జ, పెసర వంటివి కోతలు పూర్తయ్యాయి. ఇంచుమించు 90శాతం విస్తీర్ణంలో పైర్లు వివిధ దశల్లో ఉన్నాయి. వాటిలో కంది, వరి, మొక్కజొన్న, మిర్చి పత్తి ప్రధానమైనవి. వాటితోపాటు ఇతర అన్ని రకాల పంటలు పూత, పిందె, కాయ, కోత దశకు చేరుకున్నాయి. మరో నెలరోజుల్లో అధిక శాతం పంటలు చేతికొస్తాయి. అలా ప్రస్తుతం పైర్లకు అత్యంత కీలకం కాగా ఈ సమయంలో నెలకొన్న మంగు వాతావరణం వాటిని దెబ్బతీస్తోంది.