భారత్‌లోని యువతలో శారీరక వృద్ధాప్య ప్రక్రియ వేగంగా కొనసాగుతోందని శాస్త్రీయ పరిశోధనలు వెల్లడించాయి. వాషింగ్టన్ యూనివర్సిటీ స్కూల్ ఆఫ్ మెడిసిన్ పరిశోధకుల అధ్యయనం ప్రకారం, కణ విభజనను నియంత్రించే టెలోమియర్స్ అనే క్రోమోజోమ్ భాగాలు చిన్న వయసులోనే తగ్గిపోవడం వల్ల యువత త్వరగా ముసలితనం బారిన పడుతున్నారు. కాలుష్యం, దురలవాట్లు, పట్టణీకరణ వంటివి దీనికి ప్రధాన కారణాలు. దీని ఫలితంగా 30-40 ఏళ్లలోపు వారికే గుండెపోట్లు, కేన్సర్లు వంటివి పెరుగుతున్నాయని అధ్యయనం పేర్కొంది. ఆరోగ్యకర జీవనశైలిని అనుసరించాలని వైద్య నిపుణులు సూచిస్తున్నారు.