శ్రీకాకుళం గ్రామీణ మండలం సింగుపురం జాతరలో బాదంపాలు తాగి 125 మందికి పైగా అస్వస్థతకు గురయ్యారు. ఆహార భద్రత అధికారులు పంపిన పాల నమూనాల పరీక్షల్లో మైక్రోబయల్ కంటామినేషన్, ప్రమాదకరమైన 'ఈ-కోలి' బ్యాక్టీరియా ఉన్నట్లు తేలింది. మానవ లేదా జంతు మల వ్యర్థాలు కలిసిన నీటిని బాదంపాలలో వాడటం వల్లే ఈ దుర్ఘటన జరిగినట్లు ప్రాథమికంగా నిర్ధారించారు. దీనివల్ల విరేచనాలు, కడుపునొప్పి, వాంతులు, జ్వరం వంటి లక్షణాలతో బాధితులు ఇబ్బంది పడ్డారు. బాదంపొడి ప్యాకెట్లలో కృత్రిమ రంగులు ఉన్నట్లు కూడా గుర్తించారు. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు బాధ్యులపై చర్యలు తీసుకుంటామని అధికారులు తెలిపారు.